10 పోయి 11 వచ్చింది…ఏంటి సామి ఇది!

  తొలి సినిమా ‘అఖిల్’ తేడా కొట్టినప్పటికీ.. ‘హలో’ విషయంలో చాలా భరోసాతో కనిపించాడు అక్కినేని అఖిల్. మంచి ట్రాక్ రికార్డున్న.. మనసుతో సినిమా తీస్తాడని పేరున్న విక్రమ్ కుమార్‌ను దర్శకుడిగా పెట్టుకుని సొంత నిర్మాణ సంస్థలో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. కానీ ఫలితం ఏమైందో తెలిసిందే. మంచి టాక్ వచ్చినా అందుకు తగ్గ కలెక్షన్లు రాలేదు. చివరికి ‘హలో’ కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. ఈ పరిస్థితుల్లో అఖిల్ భవిష్యత్తేంటో అర్థం కావట్లేదు. ‘హలో’ పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్లో అఖిల్ మాట్లాడుతూ.. జనవరి 10న తన కొత్త సినిమా గురించి ప్రకటన ఉంటుందని వెల్లడించాడు.

ఐతే జనవరి 10 వచ్చింది. వెళ్లిపోయింది. ఇంకో పది రోజులు కూడా గడిచిపోయాయి. ఇప్పటిదాకా అక్కినేని కాంపౌండ్ నుంచి చప్పుడు లేదు. జనవరి 10 అని డేట్ పక్కాగా చెప్పాడంటే అన్నీ ఓకే అయిపోయి ఇక ప్రకటన చేయడమే తరువాయి అయి ఉంటుందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడీ సైలెన్స్ చూస్తుంటే అలాంటి స్పష్టత ఏదీ లేదని అర్థమవుతోంది.

‘హలో’ ఫలితం చూశాక నిర్ణయంలో ఏమైనా మార్పు జరిగిందో ఏమో? ఇంతకుముందు ఆది పినిశెట్టి హీరోగా ‘మలుపు’ అనే సినిమా తీసి అతడి అన్నయ్య చెప్పిన కథకు అఖిల్, నాగ్ ఓటేశారని ప్రచారం జరిగింది. ఐతే ‘హలో’ తేడా కొట్టాక మనసు మార్చుకున్నారని.. కొరటాల శివను ట్రై చేస్తున్నారని.. అతను తప్ప అఖిల్ కు ఇంకెవ్వరూ హిట్టివ్వలేరని నాగ్ భావిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో అఖిల్ మూడో సినిమాపై స్పష్టత రావచ్చని అంటున్నారు.

Leave a Comment